గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయే ముందు టీడీపీ నేతగా ఉన్నప్పటికీ.. గతంలో ఆయన కాంగ్రెస్ నేత. మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు.

అయితే.. ఒకప్పుడు చంద్రబాబును ఓడించేందుకు ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో చేతులు కలిపారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను తరిమి కొట్టేందుకు.. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్.. కాంగ్రెస్ కే మద్దతు తెలిపారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎన్టీఆర్ కి అలాంటి పరిస్థితి ఎప్పుడు, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా..?  ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

1995 నవంబర్‌ 23వ తేదీ మునిసిపల్‌ స్టేట్‌ చాంబర్స్‌ ఎన్నికలు జరిగాయి. అప్పటికి... ఎన్టీఆర్‌తో విభేదించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. స్టేట్‌ చాంబర్‌ అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వివేకానందరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా అప్పటి చిత్తూరు మునిసిపల్‌ చైర్మన్‌ మనోహర్‌,  ఎన్టీఆర్‌ తెలుగుదేశం అభ్యర్థిగా బాపట్ల మున్సిపల్‌ చైర్మన్‌ వెంకట్రావు పోటీపడ్డారు.

ఎవరికి వారుగా పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థే నెగ్గేవారు. దీంతో... వివేకా ఎన్టీఆర్‌ను కలిశారు. అభ్యర్థిని ఉపసంహరించుకుని, కాంగ్రెస్ కు మద్దతు  పలికితే చంద్రబాబు అభ్యర్థిని ఓడించవచ్చునని చెప్పి... ఒప్పించారు. ఎన్టీఆర్‌ అలాగే చేశారు. చాంబర్‌ అధ్యక్షుడిగా వివేకా విజయం సాధించారు. అలా ఎన్టీఆర్, ఆనం వివేకానందలు కలిసి.. చంద్రబాబు ప్రతిపాదించిన అభ్యర్థిని ఓడించారు.