నెల్లూరు: తెలుగుదేశం పార్టీపై మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ధనబలంతో వైసీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత జగన్‌ దగ్గర జనబలం ఉందని స్పష్టం చేశారు. వైసీపీ సానుభూతిపరులు, ఓటరు జాబితాలో లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

ఓటర్‌ లిస్టులు దగ్గర పెట్టుకుని సర్వేలు చేస్తున్నారని, డబ్బున్న అభ్యర్థులకే వైసీపీ టికెట్లు ఇస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.