ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కైవల్యారెడ్డి తన భర్త రితేష్‌తో కలిసి నారా లోకేష్‌ను కలిశారు. ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని.. ఈ క్రమంలోనే లోకేష్‌ను కలిశారని సమాచారం. టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఆమె చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద కైవల్యారెడ్డి ప్రస్తావించినట్టుగా సమాచారం.
లోకేష్‌తో కైవల్యారెడ్డి భేటీ ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ‘‘లోకేష్‌ను కైవల్య కలిసిందా.. అయితే ఆమెనే అడగండి. ప్రస్తుతం కైవల్య బద్వేలులోని బిజివేముల కుటుంబ సభ్యురాలు’’ అని చెప్పారు.
కైవల్యా రెడ్డి అత్తారిల్లు వైస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉంది. బద్వేలు టీడీపీ మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి అనుచరులు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
ఇక, గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ ఎన్నికలో వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున కైవల్యా రెడ్డి పోటీ దిగుతారా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
