విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసింది. ఈ దుర్ఘటలనలో ఇప్పటికే 8 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యీరు. ఈ ప్రమాదంపై కేంద్ర ఆర్థికమంత్రి అమిత్ షా స్పందించారు. 

వైజాగ్ దుర్ఘటనపై అమిత్ షా ట్విట్టర్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేశారు. '' గ్యాస్ లీకేజీ దుర్ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈ ప్రమాదంపై ఎన్డీఎమ్ఏ అధికారులతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడాను. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు దగ్గరనుండి పరిశీలిస్తున్నాం.  విశాఖపట్నం ప్రజలు ఆరోగ్యం బాగుపడాలని ఆ దేవున్ని కోరుకుంటున్నా'' అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.  

గ్యాస్ లీకేజీ ఘటన గురించి తెలుసుకున్న  ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే వాకబు చేసారు. ఆయన కాసేపట్లో విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించడంతో పాటు భాధితులను కూడా ఆయన పరామర్శించనున్నారు. 

ఏపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి ఈ విషయం తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులతో సంప్రదించారు.తక్షణమే  ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీచేశారు.  పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంచరపాలెం, కృష్ణానగర్ తదితర  ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి సూచించారు మంత్రి గౌతమ్ రెడ్డి. జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేసారు.