ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత, అంబికా సంస్థల అధినేత అంబికా రాజా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అంబికా రాజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచి పరిణామమని అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్లనాని. అంబికా రాజాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంబికా రాజా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. 

ఆర్యవైశ్య సామాజిక వర్గంలో పేదలకు ఎంతో సేవ చేశారని వారి అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంబికా రాజా క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అందుకు కార్యకర్తలు అంతా కష్టపడి పనిచేయాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పిలుపునిచ్చారు. 

ఇకపోతే అంబికా రాజా సోదరుడు అంబికా కృష్ణ. తెలుగుదేశం పార్టీలో ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమి పాలైన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరారు.