ఫిల్మ్ ఇండస్ట్రీని విశాఖ తెస్తానంటున్న చంద్రబాబు సినీ పరిశ్రమను విజయవాడకు తెస్తానంటున్న అంబికా కృష్ణ
‘‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. మా ఊరి మిరియాలు తాటికాయంత’’ అన్నాడంట.. అలా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వ మాటలు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, లోకేష్ లు చెబుతూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిగాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. తాజాగా వీరి జాబితాలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కమిటీ ఛైర్మన్ అంబికా కృష్ణ కూడా చేరారు.
రాష్ట్ర విభజన జరుగుతుంది అనగానే.. సీమాంధ్రకు చెందిన చాలా మంది సినీ ప్రముఖులు..ఏపీకి వచ్చేయాలని అనుకున్నారు. విశాఖపట్నం అందుకు అనువుగా ఉంటుంది కాబట్టి.. ఏపీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేస్తుందని అందరూ ఆనందం వ్యక్తం చేశారు. కానీ.. .. అనూహ్యంగా హుద్ హుద్ తుపాను రావడంతో.. అంతా తలకిందులైంది. విశాఖ రూపురేఖలు మారిపోయాయి. దానిని తిరిగి మాములు స్థితికి తీసుకురావడానికి చాలాకాలమే పట్టింది. ఈ హుద్ హుద్ దెబ్బకి.. ఇటువైపు చూడటానికి సినీ పెద్దలు జంకుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. దీంతో.. మరే ఆలోచన లేకుండా సినీ పరిశ్రమ.. హైదరాబాద్ లో పాతుకుపోయింది. ఇక ఏపీకి వస్తుందనే ఆలోచన కూడా లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీని విజయవాడకు తీసుకువస్తామని ఫిల్మ్ డెవలప్ మెంట్ కమిటీ ఛైర్మన్ అంబికా కృష్ణ చెబుతున్నారు. విజయవాడలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యాఖ్యలపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అన్ని సదుపాయాలు ఉన్న విశాఖ వైపు చూడటానికే సినీ పెద్దలు ఆసక్తి చూపడం లేదు. అలాంటిది.. ఏ మౌళిక సదుపాయం లేని విజయవాడకు ఎలా తీసుకువస్తారు? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్ప.. ఇది జరిగే పనికాదని అంబికా కృష్ణకి కూడా తెలుసు. మరి ఈ మాటలు అన్ని ఎందుకు.. కేవలం ప్రజలను మభ్య పెట్టడం కోసమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
