టీడీపీ నేతలపై ధ్వజమెత్తిన అంబటి ఇసుక మాఫియాకు పాల్పడుతారన్న అంబటి  ప్రజాదనాన్ని  దోచుకుంటున్నారని ఆగ్రహం

టీడీపీకి చెందిన దాదాపు 30మంది నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

ఇటీవల విజయవాడలో ర్యాలీ ఫర్ రివర్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీని గురించి అంబటి మాట్లాడుతూ .. తన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇసుక, మట్టి అక్రమ రవాణాల్లో ఒక వైపు వందలు, వేల రూపాయలు వెనక వేసుకుంటుంటే..నదుల సంరక్షణ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. నదుల పరిరక్షణ గురించి చంద్రబాబు మాట్లాడటం మన దౌర్భాగ్యమని అంబటి వ్యాఖ్యానించారు. సాక్షాత్తు నదీ గర్భంలో నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు నివసిస్తున్నారని ఆయన అన్నారు. 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీలో ఉన్నారని.. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిపోయిందని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలోని అన్ని నదుల్లోంచి ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక దోపిడీ జరుగుతోందని వెల్లడించారు.

ఇసుక మీద వచ్చే ఆదాయంతో డ్వాక్రా మహిళలను లక్షలాధికారులను చేస్తానని ప్రగాల్బాలు పలికిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతూ నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అర్థ రహిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.