వృధా ఖర్చులను చేయవద్దని హెచ్చరిస్తున్న చంద్రబాబు అమరావతి నిర్మాణంపై సమీక్ష రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్లు వృధా చేస్తున్నదెవరు ?  

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మాటలకు, చేతలకు అస్సలేమాత్రం పొంతన ఉండటం లేదు. రాజధాని నిర్మాణంలో ఒక్క పైసా కూడా అనవసరంగా వెచ్చించ వద్దని సిఎం చంద్రబాబు చేసిన తాజా హెచ్చరికలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు వృధా ఖర్చులు చేస్తున్నదే చంద్రబాబని ప్రజలు అనుకుంటున్న విషయం సిఎం దృష్టికి ఇంకా చేరలేదేమో.

వృధా ఖర్చులు ఆయన చేస్తూ అనవసర ఖర్చులు చేయవద్దని ఉన్నతాధికారులను హెచ్చరించటం విశేషం. రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపనల పేరుతో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వృధా చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమోనని అందరూ అనుకుంటున్నారు. శుక్రవారం అరుణ్ జైట్లీని పిలిపించి అమరావతిలో మళ్ళీ శంకుస్ధాపలను చేయిస్తున్నారు. శంకుస్ధాపలన పేరుతో ఇంకెంత మందిని పిలిపించి మరెన్ని కోట్లు వ్యయం చేస్తారో ఆయనకే తెలీదు.

 ఎందుకంటే, రాజధాని నిర్మాణానికి ముందుగా భూమి పూజ చేసిందే చంద్రబాబు దంపతులు. చంద్రబాబు భూమిపూజ చేసిన తర్వాత అదే స్ధానంలో ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడి చేత శంకుస్ధాపన పేరుతో మళ్ళీ పెద్ద తంతే నడిపించారు. దానికి సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు చేసిన భూమిపూజకు నరేంద్రమోడి చేయబోయే శంకుస్ధాపనకు తేడా ఏమిటని ప్రధాని కార్యాలయం ఆరా తీసిందని ప్రచారం జరిగింది.

అంతే కాకుండా, రాజధాని తయారీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ కంపెనీలకు రూ. 12 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా మాస్టర్ ప్లాన్నుకంపెనీలు ఉచితంగా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. ఆ తర్వాత చెల్లించిన రూ. 12 కోట్లు ఏమిటంటే సమాధానం చెప్పలేదు. అదేవిధంగా, అంతర్జాతీయ స్ధాయిలో మాస్టర్ డిజైన్లు ఇచ్చిన జపాన్ కంపెనీ మాకీ అసోసియేట్స్ కు సుమారు 95 కోట్లు చెల్లించింది.

 ఇంతకీ సదరు సంస్ధ ఇచ్చిన డిజైన్లు ఎవరికీ నచ్చకపోవటంతో ఆ డిజైన్లను ప్రభుత్వం పక్కన పడేసింది. అంటే 95 కోట్ల రూపాయలు బూడిదలో సోసిన పన్నీరేనన్న విషయం అందరికీ అర్ధమవుతోంది. ఇక రాజధాని నిర్మాణంలో తన ఆధ్వర్యంలో జరిగిన విదేశీ ప్రయాణాలకు అంతే లేదు.

ప్రతీసారి తన వెంట ఉన్నతాధికారులను కూడా తీసుకెళ్లటం, తిరిగి రాగానే తనతో పాటు వచ్చిన ఉన్నతాధికారులను ఇంకో చోటికి బదిలీ చేయటం రివాజుగా మారింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శులు సాంబశివరావు, గిరిధర్ తదితరులు ఆ విధంగా బదిలీ అయినవారే. అంటే వారిపై ప్రభుత్వం చేసిన లక్షలాది రూపాయలు పూర్తిగా వృధా అయినట్లే.

అదే విధంగా ప్రతీ విదేశీ ప్రయాణానికి ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఉన్నతాధికారుల బృందాలు కూడా విదేశాలు చుట్టి రావటం సర్వ సాధారణమైపోయింది. రాజధాని నిర్మాణంపై అధ్యయనం పేరుతో ఇప్పటికే డజన్ల సంఖ్యలో ఉన్నతాధికారుల బృందాలు విదేశాల్లో చక్కర్లు కొట్టి వచ్చాయి. వారి అధ్యయనాలేమిటో, అమరావతి నిర్మాణానికి ఏ విధంగా పయోగపడుతాయో సామాన్య ప్రజానీకానికి మాత్రం ఏమీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు విదేశీ యానాలైనా, ఉన్నతాధికారులు చుట్టి వస్తున్న విదేశాలకు అయ్యే యావత్ ఖర్చులైనా ప్రజా ధనమేనన్న విషయాన్ని పాలకులు మరచిపోయినట్లు కనబడుతోంది.