ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత ప్రజలు నిరసనలు చేపట్టి 200 రోజులైన సందర్భంగా ప్రజలంతా నేడు తమ ఉద్యమానికి మరోసారి పునరంకితమవ్వడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. 

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేటి ఉదయం నుండి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా రాజధాని రైతులను ఉద్దేశించి జూమ్ కాల్ ద్వారా వర్చువల్ గా మాట్లాడుతూ వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈసంధర్భంగానే వైసీపీ కి తలనొప్పిగా తయారైన రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. 

ఆయన మాట్లాడుతూ... అమరావతి ప్రాంత ప్రజలకు, అమరావతి ఉద్యమానికి తఖ్న మద్దతును ప్రకటించారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారని అన్నాడు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం విషయాన్నీ పూర్తిగా వ్యతిరేకించకుండానే చాలా జాగ్రత్తగా జగన్ ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేసారు. 

ఆయన ఎప్పటినుండో అంటున్నట్టే కార్యనిర్వాహక రాజధానిని అమరావతిలో ఉంచొచ్చు కదా అని వాదించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు విశాఖకు తరలించి అక్కడ రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టడం కన్నా, ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న అమరావతిని వాడుకోవాలని సూచించారు. 

తన పార్టీకి తాను ఇచ్చే సలహా ఇదేనని అంటున్నాడు. శాసన రాజధానిని విశాఖకు తరలించి, కార్యనిర్వాహక రాజధానిని అమరావతిలో ఉంచేలా చూడాలని ఆయన అన్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడానికి రఘురామ సిద్ధంగా లేరు. 

నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కూడా అవడంతో....  ఆయనకు మాజీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రజల మాదిరిగానే ఆనాడు కూడా తెల్లదొరలు కూడా మన్యం ప్రజల హక్కులను కాలరాశారని... వారికి అండగా నిలిచి అల్లూరి పోరాటం చేశారని అన్నారు. అల్లూరి స్పూర్తిని అందుకుని రాష్ట్ర ప్రజలకు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై పోరాడాలని  లోకేష్ సూచించారు. 

''ఈరోజు రాజధాని ప్రాంత ప్రజలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న దారుణ మారణకాండ మాదిరిగానే...  ఆరోజు మన్నెం ప్రజల హక్కులను తెల్లదొరలు కాలరాశారు. అయితే నాడు గిరిజనులందరినీ ఏకంచేసి తెల్లవారి గుండెలదిరేలా చేసారు అల్లూరి సీతారామరాజు '' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''నాటి అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకునే కథానాయకులై రాజధాని అమరావతి రైతులకు అండగా నిలవాలి. అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను'' అంటూ సోషల్ మీడియా వేదికన లోకేష్ స్పందించారు.