ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూములను తాము స్వచ్ఛంధంగా ఇచ్చామని రైతులు స్పష్టం చేశారు.  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజధాని భూమల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని రైతులు  ఆరోపించారు. 


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూములను తాము స్వచ్ఛంధంగా ఇచ్చామని రైతులు స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజధాని భూమల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని రైతులు ఆరోపించారు. 

తుళ్లూరులో ఆదివారం రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం ఏ రకంగా పనులు జరుగుతున్నాయోననే విషయాలు తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడడాన్ని వారు తప్పుబట్టారు. రెవిన్యూ అధికారులను శత్రువులుగా చూడొద్దని వారు కోరారు.

సినిమాల్లో మాదిరిగా పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పి వెళ్లారని రైతులు విమర్శలు గుప్పించారు. రాజధానిలో 320 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంటే ఆ విషయమై స్పష్టత లేదన్నారు. 

అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి గురించి పవన్ కళ్యాణ్‌కు ఏం తెలుసునని రైతులు ప్రశ్నించారు. ప్రతిసారి ఉద్యమం చేస్తామని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు హస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాలను గమనించిన తర్వాత ప్రకటనలు చేస్తే ప్రయోజనంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.