మూడు రాజధానుల బిల్లు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో రాజధాని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మందడం గ్రామంలో మహిళా రైతులు గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు.

ఎవరికోసం,ఏ రాజకీయ పార్టీ కోసం బిల్లులపై సంతకం పెట్టారో గవర్నర్ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు గవర్నర్ కళ్లకు కనిపించడం లేదా అని వారు నిలదీశారు.

228 రోజులనుండి అమరావతి కోసం పోరాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రాజధాని కోసం 33000 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని కన్నీరు పెట్టించేలా గవర్నర్ వ్యవహరించారని, 5 కోట్ల ఆంధ్రుల్ని అనాథని వారు ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం కోసమే గవర్నర్ పనిచేస్తున్నారని.. మూడు రాజధానుల విషయంలో గవర్నర్ ఏకపక్ష నిర్ణయం సరికాదని మహిళా రైతులు మండిపడ్డారు. గవర్నర్ నిర్ణయం వల్ల తమతో పాటు, తమ పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడిందని.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డ్రామాలాడుతోందని రాజధాని రైతులు విమర్శించారు.

మోడీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఏదైనా అసంపూర్తిగా మిగిలిపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయం కూడా శంకుస్థాపనతో ఆగిపోవడం ఖాయమని ఆరోపించారు. మోడీ గొప్పలు చెప్పుకోవడం తప్పించి.. చేసేది ఏమి లేదని ఎద్దేవా చేశారు. రైతుల త్యాగాలు చేసిన ఇచ్చిన భూమి అమరావతని, దీనిని రాజధానిగా నిలపడమే తమ లక్ష్యమన్నారు.