అమరావతి: అమరావతి రాజధాని విషయంలో ఇప్పటివరకు బీజేపీకి చెందిన ఒక్కో నేత ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర నేతలు మూడు రాజధానులను స్వాగతిస్తుంటే, మిగిలిన ప్రాంత నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు అమరావతికి వ్యతిరేకంగా ర్యాలీలు కూడా తీశారు. 

ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతుండడంతో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ మీటింగ్ నేడు జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు ఒక తీర్మానం చేసారు.

ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి డిమాండ్ చేసారు. ఈ విషయమై మరో వర్గం వారు కేంద్రం జోక్యం అవసరం లేదన్నారు. జివిఎల్ నరసింహారావు,సోము వీర్రాజు వంటి వారు కేంద్రం జోక్యం అవసరం లేదని అన్నారు. ఈ తీర్మానం వల్ల కేంద్రం జోక్యం చేసుకుంటూనే అవకాశం లేకపోలేదు. 

హై కోర్టును కర్నూల్ లోనే ఉంచి మిగిలినవాటన్నిటిని అమరావతిలోని కొనసాగించాలని వారు డిమాండ్ చేసారు. అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించిందని, దానికి కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. 

రాజధాని సమస్య ఏదో ఒక కులానికో, ప్రాంతానికో సంబంధించిన విషయం కాదని, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ, వైసీపీలు మోసం చేశాయని వారు దుయ్యబట్టారు. 

  అమరావతి పూర్తి స్థాయి రాజధాని కాకుండా వైజాగ్, కర్నూలుతో పాటు ఏపీకి మూడు క్యాపిటల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. 

దీనితో కార్యనిర్వహణ క్యాపిటల్ అమరావతి నుంచి వైజగ్ కు తరలిపోతుందనే ఆందోళనలో అక్కడి రైతులు ఉన్నారు. గత కొన్ని వారాలుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానికి భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని పలు గ్రామాల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. కొందరు రైతులు కూడా మరణించారు. 

ఈ అమరావతిపై సెలెబ్రిటీలతో సహా చాలా మంది మద్దతు తెలుపుతుంటే...మరికొందరేమో మూడు రాజధానులను సపోర్ట్ చేస్తున్నారు.   

అమరావతి రైతుల ఆవేదనపై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గుండె బద్దలయ్యే వేదన ఇది. రైతులు ఇంతటి వేదన అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్లు ఉండేవారిని చూస్తుంటే భాదగా ఉంది. అమరావతి రైతులారా మీకు నేనున్నా.. మీరు కోసం నేను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా.. మీ బాధని పంచుకుంటున్నా. ఏదైనా సాధించడానికి మనందరం చేతులు కలుపుదాం'అని స్మిత ట్వీట్ చేసింది.