చీరాల: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ విబేధాలు బహిర్గతమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ పై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేశాడు.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబం వైసీపీలో చేరడాన్ని ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా అప్పట్లో ప్రచారంలో ఉంది. కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. కరణం బలరాం మాత్రం జగన్ కు మద్దతును ప్రకటించారు.

చీరాలలో కరణం వర్గీయులు, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు పొసగడం లేదు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో చీరాలలో టీడీపీ టిక్కెట్టు పోతుల సునీతకు కేటాయించారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించాడు. ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. 

ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీలో చేరడాన్ని పోతుల సునీత వర్గీయులు అప్పట్లో వ్యతిరేకించారు. కానీ టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశాడు. దీంతో చీరాలలో కరణం బలరాంకి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కరణం బలరాం విజయం సాధించాడు.

టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలు, జిల్లా రాజకీయాలు, కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కరణం బలరాం జగన్ కు మద్దతు ప్రకటించారు. టెక్నికల్ గా ఆయన వైసీపీలో మాత్రం చేరలేదు. తనయుడు కరణం వెంకటేష్ మాత్రం వైసీపీలో చేరాడు.

కరణం వెంకటేష్ వైసీపీలో చేరడానికి కొన్ని రోజుల ముందే టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరింది. చీరాలలో పోతుల సునీత, కరణం వెంకటేష్ వర్గం వైసీపీలో ఏకతాటిపై ఉంది. ఆమంచి కృష్ణమోహన్ ను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

also read:నా పేరును ఉచ్చరించేవారు... వార్నింగ్ ఇస్తారా: కరణంపై ఆమంచి కామెంట్స్

ఈ నెల 2వ తేదీన వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆమంచి కృష్ణ మోహన్, కరణం వర్గాలు పోటా పోటీగా చీరాలలో కార్యక్రమాలు నిర్వహించాయి.ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.ఈ సమయంలో కరణం వెంకటేష్ పరోక్షంగా ఆమంచి కృష్ణమోహన్ పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆమంచి కృష్ణ మోహన్ ధీటుగా జవాబిచ్చాడు. నా పేరు చెప్పడానికి భయపడేవాళ్లు నాకు వార్నింగ్ ఇస్తారా అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో  తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నాలు ప్రారంభించారు. పోతుల సునీత, కరణం వెంకటేష్ పై  ఆమంచి కృష్ణమోహన్ గురువారం నాడు ఫిర్యాదు చేశాడు.

కరణం వెంకటేష్ వైసీపీలో చేరడంతో ఆమంచి కృష్ణమోహన్ ను జిల్లాలోని మరో నియోజకవర్గానికి వెళ్లాలని వైసీపీ నాయకత్వం సూచించినట్టుగా గతంలో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై ఆయన ఒప్పుకోలేదనే ప్రచారం కూడ ఉంది.ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదుపై వైసీపీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.