అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కు కీలక పదవి కట్టబెట్టారు సీఎం వైయస్ జగన్. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపోతే ద్రోణంరాజు శ్రీనివాస్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా ఆయనను విశాఖపట్నం మెట్రోరీజియన్ డవలప్ మెంట్ అథారిటీ  చైర్మన్ గా నియమించారు. 

ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పనిచేశారు ద్రోణంరాజు శ్రీనివాస్.