తుందుర్రు ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీపై ఆళ్ల నాని వ్యతిరేకత చంద్రబాబుపై ద్వజమెత్తిన నాని
తుందుర్రు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతపాడుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని ఆరోపించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఆ ప్యాక్టరీకి వాచ్మెన్లా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రజలను ప్రభుత్వం పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. 24 మంది అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ప్రజలు గ్రహించారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ కంపెనీ యాజమాన్యానికి కొమ్ము కాస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తుందుర్రు ప్రజలను మంత్రి పితాని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆళ్ల నాని విమర్శించారు.
