చంద్రబాబు ప్రభుత్వంపై న్యాయపోరాటాలు చేయటం ద్వారా ఆళ్ళ చంద్రబాబు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ప్రతిపక్ష ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు, అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఆళ్ల పెద్ద న్యాయపోరాటమే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 అంశాలపై ఎంఎల్ఏ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసారు. వాటిల్లో చాలా కేసులు విచారణదశలో ఉన్నాయి. ఓటుకునోటు కేసులో చంద్రబాబుకు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేసిందంటే ఆళ్ళ పోరాట ఫలితమే. రాజధాని గ్రామాల్లోని రైతుల ఇళ్ళను ప్రభుత్వం కొట్టేసేందుకు సిద్ధపడింది. అపుడు కూడా రైతుల తరపునే ఆళ్ళ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు.
రాజధాని రైతుల తరపున సుమారు 20 కేసులు వేసారు. నదికి-కరకట్టకు మద్య ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ కృష్ణానది కరకట్టపైనే ఎన్నో కట్టడాలున్నాయి. అవన్నీ అక్రమ కట్టడాలే. పైగా అందులో ఒకదానిలో చంద్రబాబు నివాసముంటున్నారు. ఈ విషయంపైన కూడా కేసు దాఖలు చేసారు. రాజధాని నిర్మాణం కోసమంటూ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రతీ విద్యార్ధి, ఉపాధ్యాయుడి నుండి రూ. 10 వసూలు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఓ ఉత్తర్వు జారీ చేసారు. దానికి వ్యతిరేకంగా కూడా ఆళ్ళ ఓ కేసు వేసారు. ఉత్తర్వును పరిశీలించిన కోర్టు వెంటనే ఉత్తర్వును కొట్టేసింది.
రాజధాని ప్రాంతంలో భూముల కుంభకోణాలు కావచ్చు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా అనర్హుడిని నియమించారని కావచ్చు, అమరావతి ప్రాంతంలో స్ధాలను అనర్హులకు కట్టబెడుతున్నారని కూడా కావచ్చు. ఇలా అనేక అంశాలపై న్యాయపోరాటం చేయటం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఆళ్ళ గుక్కతిప్పుకోనీకుండా చేస్తున్నారు. తాజాగా జీవో నెంబర్ 14 అమలును నిలిపేయాలంటూ కోర్టుకెక్కారు. రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వలకు వ్యతిరేకంగానే ఆళ్ళ హై కోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కోర్టు ఆదేశించటం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వంపై న్యాయపోరాటాలు చేయటం ద్వారా ఆళ్ళ ‘ఆంధ్ర సుబ్రమణ్యం స్వామి’ అని అనిపించుకుంటున్నారు.
