ఏపీలో టెక్నాలజీ ఆధారిత పాలనలో మరో ముందడుగు.. మనమిత్ర ద్వారా అన్ని పౌరసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పౌరులకు టెక్నాలజీ ద్వారా సేవలు అందించడంలో మరో మెట్టు ఎక్కింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలవుతోన్న 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్' కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ వేదికపై నుండి అన్ని పౌర సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రకటించారు.

ప్రస్తుతం హాల్ టికెట్లు, రేషన్ కార్డులు, దేవాలయాల సేవలు, రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సర్వీసులు ఈ వేదికపై అందుతున్నాయి. ఇకపై అన్ని అవసరాలూ మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ (Whatsapp) ద్వారా పూర్తయ్యేలా మారబోతున్నాయి.

సచివాలయం నుంచి సోమవారం వర్చువల్ విధానంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన చంద్రబాబు, రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు చేపట్టనున్నట్టు ప్రకటించారు. సేవారంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. టెక్నాలజీ ఆధారిత పాలనలే భవిష్యత్తని భావిస్తున్న ఆయన, డిజిటల్ రంగంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

‘తల్లికి వందనం’ పథకం…

అలాగే, ‘తల్లికి వందనం’ పథకం అమలు విషయంలో స్పష్టత ఇచ్చారు. జూన్ నెలలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. మహిళల రవాణా ఖర్చును తగ్గించేందుకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

గ్యాస్ సిలిండర్లు ఉచితంగా..

ఇక దీపం-2 పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. తిరుమల నమూనాలో 21 దేవాలయాల్లో అన్నప్రసాద వేదికలు ఏర్పాటు చేశామని చెప్పారు.

పేదరికం నిర్మూలనే ధ్యేయంగా 'పీ-4' కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమలో నీటి కష్టాల నివారణ కోసం పోలవరం-బనకచర్ల అనుసంధానాన్ని పూర్తి చేయనున్నట్టు వివరించారు.