చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. మద్దతు తెలిపిన తారకరత్న భార్య, పిల్లలు..
పలువురు ఐటీ నిపుణులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీకి శ్రీకారం చుట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు ఐటీ నిపుణులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 24) రోజున ఈ ర్యాలీ చేపట్టనున్నారు. వారంతా హైదరాబాద్ నుంచి ర్యాలీగా రాజమండ్రి చేరుకుని.. చంద్రబాబు కుటుంబ సభ్యులను కలవనున్నారు.
అయితే ఈ సంఘీభావ ర్యాలీకి దివంగత టీడీపీ నేత నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి మద్దతు తెలిపారు. ఐయామ్ విత్ సీబీఎన్ అనే పోస్టర్లతో అలేఖ్య, ఆమె పిల్లలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అలాగే అలేఖ్య తన చేతితో తారకరత్న ఫొటోను కూడా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
అయితే చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఐటీ నిపుణులు చేపట్టనున్న సంఘీభావ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకే పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు, టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి రాజమండ్రికి బయలుదేరారు.
మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నేపథ్యంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో ఏపీ పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. విజయవాడ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలిస్తున్నారు.