ఆళ్లగడ్డ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. ఎవి పై మౌనిక రెడ్డి ఫైర్

Akhilapriya's sister bhuma mounika reddy explains on Allagadda incident
Highlights

ఆళ్లగడ్డ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. ఎవి పై మౌనిక రెడ్డి ఫైర్

ఆళ్లగడ్డ పంచాయితి కొత్త మలుపు తిరిగింది. ఆళ్లగడ్డ వ్యవహారం అమరావతి చేరింది. ఇక పరిష్కారం దొరుకుతుంది అని కేడర్ అనుకుంటుండగానే అమరావతిలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డి సీన్ లోకి ఎంటరయ్యారు. మరి ఆ వివరాలు కింద చదవండి.

భూమా అఖిలప్రియ వర్సెస్ ఎవి సుబ్బారెడ్డి పంచాయితి కాస్తా అమరావతి చేరింది. బుధవారం ఎవి సుబ్బారెడ్డి వచ్చి చంద్రబాబును కలిశారు. అయితే తమకు సమాచారం లేదని అఖిలప్రియ బుధవారం సమావేశానికి హాజరు కాలేదు. కానీ గురువారం ఆమె అమరావతి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మీడియా ముందుకు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ చెల్లెలు మౌనిక రెడ్డి వచ్చారు. మౌనిక రెడ్డి మాట్లాడుతూ ఎవి ని కడిగిపారేశారు.

ఎపి హెల్ప్ లైన్ లో గంగుల వారితో తనకు విభేదాలు లేవని ఎవి సుబ్బారెడ్డి ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ఆరోజే భూమా క్యాడర్ ను బాధపెట్టిన మనిషిగా మిగిలిపోయావన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఏనాడూ మా నాన్న భూమానాగిరెడ్డి ఫొటో పెట్టలేదన్నారు. భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయిందన్న ఎవి సుబ్బారెడ్డి మరి కన్నకూతురుతో సమానంగా చూసుకోవాల్సిన వ్యక్తి మీద బురద చల్లడం న్యాయమా అని ప్రశ్నించారు. మా నాన్న సమాధి వద్దకు రాలేదు.. నివాళులు అర్పించలేదు అని ఆరోపించారు.

భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపితే క్యాడర్ ఎవరూ ఒప్పుకోరు అని చెప్పదలుచుకున్నాను అని హెచ్చరించారు. భూమా క్యాడర్ అంతా అక్కను సొంత కూతురుగా చూసుకుంటారని అన్నారు. పోలీసు కేసు పెట్టారు కాబట్టి విచారణకు సహకరిస్తామని, దాడి ఎవరు చేశారన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. పోలీసు శాఖ ప్రూవ్ చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈలలు వేసుకుంటూ, బైక్ మీద స్టంట్స్ చేస్తూ వెటకారం చేస్తూ ర్యాలీ తీయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

కూరుతుతో సమానం అంటూనే మీడియా ముందుకు ఎవి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కూతరుతో పంచాయితి అయితే మీడియా ముదుకు వెళ్తారా? అని నిలదీశారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటారు కదా? అని ప్రశ్నించారు. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా గుంట నక్కల లాంటివాళ్లు చాలా మంది ఉన్నారు అని అక్క అన్నారు తప్ప ఎవి సుబ్బారెడ్డి గుంట నక్క అని ఏనాడూ అక్క అనలేదన్నారు. అయినా గుంట నక్క అనగానే ఎవి సుబ్బారెడ్డి భుజాలు ఎందుకు తడుముకోవాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలన్నారు.

భూమా కుటుంబం మీద వేలెత్తి చూపకుండా ఉంటే అభ్యంతరం లేదు. మంత్రి నియోజకవర్గంలో ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు.

loader