అఖిల అవసరం తీరిపోయిందా ?

First Published 21, Nov 2017, 3:05 PM IST
Akhila Priya seems to have lost utility value in TDP government
Highlights
  • చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ అవసరం తీరిపోయినట్లే కనబడుతోంది.
  • పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అఖిల కేంద్రంగా ‘ఏదో’ జరుగుతోంది అన్న అనుమానాలు వస్తున్నాయి.

చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ అవసరం తీరిపోయినట్లే కనబడుతోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అఖిల కేంద్రంగా ‘ఏదో’ జరుగుతోంది అన్న అనుమానాలు వస్తున్నాయి. వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలు టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే, హటాత్తుగా నంద్యాల ఎంఎల్ఏ నాగిరెడ్డి మరణించటంతో ఉపఎన్నిక జరిగింది. నాగిరెడ్డి పోయిన కొంత కాలానికి మంత్రివర్గ విస్తరణ జరిగినపుడు చంద్రబాబు అఖిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

నిజానికి చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చింది నాగిరెడ్డికి. నాగిరెడ్డి బతికున్నంత కాలం మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో కథలు చెప్పి కాలం నెట్టుకొచ్చారు. అయితే, హటాత్తుగా నాగిరెడ్డి మరణించటంతో అఖిలకు మంత్రిని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికను గెలుచుకోవాలి కాబట్టి. లేకపోతే సెంటిమెంటు వర్కవుట్ అవ్వదనే అఖిలకు మంత్రిపదవి కట్టబెట్టారన్న విషయం అందరకీ తెలిసిందే. అనుకున్నట్లే ఉపఎన్నికలో టిడిపి గెలిచింది.

ఎప్పుడైతే నంద్యాలలో టిడిపి గెలిచిందో అప్పటి నుండి అఖిలకు ప్రాధాన్యత తగ్గుతోంది. దానికితోడు మంత్రిపై సిఎం వద్దకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో మంత్రి వ్యవహారశైలిపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా తన పేఫీకి వచ్చిన ఫైళ్ళు చూడటంలొ కూడా అఖిల ఆశక్తి చూపరు. తన వద్దకొచ్చిన ప్రతీ ఫైలును మంత్రి 35 రోజులు ఉంచుకుంటున్నట్లు చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి అందిరికీ తెలిసిందే.

అదే సమయంలో బోటు ప్రమాదం జరగటం చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది. అందుకనే, ‘రాజీనామా’, ‘నైతిక బాధ్యత’ గురించి అఖిల సమక్షంలోనే బాహాటంగానే వ్యాఖ్యానించారు. దాంతో అఖిలపై పెద్ద బాంబే పడింది. పరిణామాలు చూస్తుంటే ఎక్కువ కాలం అఖిల మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలు లేవనే అనిపిస్తోంది.

ఎందుకంటే, అఖిలను మంత్రి పదవి నుండి తొలగించినా చంద్రబాబును ప్రశ్నించే వారే ఉండరు. పార్టీలో కానీ జిల్లాలో కానీ అఖిల దాదాపు ఒంటరైపోయారు. తన వ్యవహారశైలి వల్ల, దూకుడు వల్ల అందరినీ దూరం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అసలు టిక్కెట్టు ఇవ్వకపోయినా ఆశ్చర్య పోవక్కర్లేదు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంటు ఏమైనా పనిచేస్తుందని చంద్రబాబు అనుమినిస్తే అఖిలకు పార్టీ పదవి ఏమైనా అప్పగించవచ్చు. ఎటుతిరిగి  కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో అఖిల కూడా ఉంటారేమో.

నచ్చని వాళ్ళను తొక్కేయటంలోనూ, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటంలోనూ చంద్రబాబును మించిన వారు ఎవరూ ఉండరన్న విషయం తెలిసిందే. కాబట్టి, బోటు ప్రమాదాన్నిఅవకాశంగా తీసుకుని అఖిలను పక్కన బెట్టేస్తారనే ప్రచారం జోరందుకుంది. కాకపోతే ముహూర్తమే ఎప్పుడో తెలియటం లేదు.

loader