న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 నగరాల్లో కాలుష్యం విపరీతంగా ఉందని కేంద్రం నివేదిక తెలుపుతోంది. ఈ నగరాల్లో స్వచ్ఛమైన గాలిని లభించేలా అన్ని రకాల చర్యలు తీసుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా విజయసాయిరెడ్డికి సమాధానం ఇచ్చారు. 

2014 నుండి 2018 వరకు దేశంలోని పలు నగరాల్లో గాలి స్వచ్ఛతపై అధ్యయనం జరిపిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, ఏలూరు, ఒంగోలు, చిత్తూరు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్టణం నగరాల్లో గాలి నాణ్యత అత్యల్పంగా ఉందని కేంద్రం ప్రకటించింది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కాలుష్యం బారిన పడిన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్టుగా కేంద్రం వివరించింది.

రోడ్లపై ఉండే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటి నగరాల్లో వాయి కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. వాయు కాలుష్యానికి గురైన నగరాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు ప్రణాళికలను సిద్దం చేశామని కేంద్రం తెలిపింది.