రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు బాగా పురోగమిస్తున్నాయి.  2015-16 ఆర్ధిక సంవత్సరాల్లో  రాష్ట్ర జి.వి.ఎ(గ్రాస్ వాల్యూయాడెడ్) సాధనలో ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం 31.1%తో  ముఖ్యపాత్ర పోషించింది.  మంగళవారం విజయవాడలో ప్రారంభమైన రాష్ట్ర 13వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలను వెల్లడించారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాదాయం పెంచడంలో (జివిఎ అంటే గ్రాస్ వాల్యూయాడెడ్)  కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం మొదటి స్థానం సాధించింది. ఇదే జిల్లాకు చెందిన  కలిదిండి మండలం రెండోస్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా మండలం నాగాయలంక 10వ స్థానం దక్కించుకుంది. ఇదే కాలంలో పారిశ్రామిక రంగాన  విశాఖజిల్లా గాజువాక మండలం అగ్రగామిగా నిలిచింది. విశాఖ జిల్లా విశాఖ అర్బన్ మండలం రెండో స్థానంలో నిలవగా, విశాఖ జిల్లా పరవాడ 10 స్థానంలో ఉంది.  సేవారంగంలో జీవీఏ పరంగా విశాఖ అర్బన్ మండలం మొదటి స్థానం సాధించింది. రెండో స్థానంలో విజయవాడ అర్బన్, కర్నూలు మండలం పదో స్థానంలో ఉన్నాయి. 

 కీ పెర్ఫామెన్స్ ఇండెక్స్‌లో కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలు ఎ ప్లస్ ప్లస్ రేటింగ్ సాధించాయి. చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎ ప్లస్ రేటింగ్ సాధిస్తే  కడప, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురము జిల్లాలు ఎ గ్రేడ్ లో నిలిచాయి. ఇదిలా ఉంటే 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర జీవీఏలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగం వాటా 31.1 గా నమోదైంది.

పట్టణీకరణ కారణంగా విశాఖ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర మొత్తం జీవీఏ (Total GVA)లో ర్యాంకులు వచ్చాయి.   విశాఖ-దక్షిణ నియోజకవర్గం సేవారంగంలో ప్రతిభ చూపి మూడో స్థానం దక్కించుకుంది. రాష్ట్ర  జీవీఏలో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి 10వ ర్యాంకు వచ్చింది. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా ఈ ఘనత సాధించింది.  మత్స్యరంగం ప్రధాన  ఆదాయ వనరుగా నిలిచింది. వ్యవసాయరంగంలో  మొదటి పది ర్యాంకులు దక్కించుకున్న  అసెంబ్లీ నియోజకవర్గాలు 14.8% ఆదాయాన్ని జోడించాయి. వ్యవసాయం అనుబంధ రంగాల్లో  మొదటి పది స్థానాలు చూస్తే  కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నెంబర్ వన్‌గా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి రెండో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు మూడో స్థానం దక్కింది. వ్యవసాయ అనుబంధ రంగం  ఆక్వా, మత్స్యరంగాలు తోడు చేసిన ఆదాయం వల్లనే ఈ ఘనత సాధించింది.

వ్యవసాయం, ఉద్యానపంటల వల్ల అత్యధిక జీవీఏ సాధించి సింగనమల 4వ స్థానం దక్కించుకుంది. మత్స్య, ఆక్వా రంగాల్లో కృష్ణా, పశ్చిమగోదావరి అగ్రస్థానంలో ఉన్నాయి. ఇలా ఉంటే మత్స్య, ఆక్వా రంగాలలో అత్యధిక ప్రాతినిధ్యం కారణంగానే కృష్ణా జిల్లా  కైకలూరు, పశ్చిమ గోదావరి జిల్లా  ఉండి, కృష్ణాజిల్లా అవనిగడ్డ  వ్యవసాయ, అనుబంధ రంగాలలో తొలి మూడు స్థానాలలో నిలిచాయి.

జీవీఏలో కృష్ణా జిల్లా కైకలూరు  రూ. 3,063 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి  రూ.2,107 కోట్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డ  రూ.1,497 కోట్ల జీవీఓ సాధించాయి.  పట్టణీకరణ జరిగిన నియోజకవర్గాలలో వ్యవసాయ, అనుబంధ రంగాలలో వెనుకబాటు కన్పించింది.