జగన్ వీరాభిమాని కల నెరవేరింది. జగన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఓ అభిమాని కల రేపటితో నిజమౌతోంది. ఈ ఆనందంతో ఆ వీరాభిమాని పదేళ్ల తర్వాత తన కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అనీల్ కుమార్ అనే వ్యక్తి మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయిన అనంతరం... జగన్ ని సీఎం చేయాలని అనీల్ కుమార్ కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు ఆయన ధర్నా కూడా చేశారు. అయితే... అతని వాదనను అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2009 సెప్టెంబర్ లో ఆదిలాబాద్ నుంచి బాసరకు పాదయాత్రగా వెళ్లి జగన్ సీఎం కావాలని మొక్కుకున్నారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే వరకు తన కాళ్లకు పాదరక్షలు ధరించనని ఆయన శపథం చేశారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత... అనిల్ కుమార్.. వైసీపీ కార్యకర్తగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ... ఇతను కీలక పాత్ర పోషించారు. కృష్ణా జిల్లా నూజివీడులో వైసీపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎండలు భగ్గుమంటున్నా కూడా... అనిల్ ఈ పదేళ్లలో ఏనాడు చెప్పులు ధరించకపోవడం గమనార్హం.

మండుటెండలో కూడా చెప్పులు లేకుండానే నడిచేవాడు. ఆయన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. జగన్ ఏపీ సీఎంగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను తన పాదాలకు చెప్పులు తొడుగుతానని అతను ఆనందంగా చెప్పడం విశేషం.