విజయవాడ: అక్రమ సంబంధం కారణంగా ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. అక్రమ సంబంధం కారణంగానే ఆ హత్యలు జరిగినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో మంగళవారం వెల్లడించారు. 

చింతలపూడికి చెందిన దాసరి వెంకన్న అనే వ్యక్తి వద్ద కొంత కాలంగా నూజివీడులో నివసిస్తున్న ఈదర గ్రామానికి చెందిన పెళ్లూరి చిన్న ఏసు (35) గ్రామాల్లో తిరుగుతూ పింగాణి వస్తువులు విక్రయించే పనిలో చేరాడు. వివాహేతర సంబంధం విషయంలో 20 రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 

చిన్న ఏసుపై వెంకన్న కక్ష పెంచుకుని అతన్ని చంపేందుకు పథకం వేశాడు. ఇందులో భాగంగా ఆదివారంనాడు చిన్న ఏసుతో వెంకన్న మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న చిన్న ఏసుతో అతని కుటుంబంతో సహా ఆటోలో నూజివీడు వెళ్దామని నమ్మించాడు. 

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం... వెంకన్న తన భార్య నాగణి, కుమారుడు మరో ఆటోలో ఎదురుగా వచ్చేట్లు చేశాడు. ఆటో రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లికి రాగానే అక్కడి మామిడితోటలోకి తీసుకెళ్లి చిన్న ఏసుతో మళ్లీ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతన్ని ఇనుపరాడుతో మోది చంపేశాడు. 

హత్య విషయాన్ని బయటపెడుతారనే ఉద్దేశంతో చిన్న ఏసు భార్య తిరుపతమ్మను, కూతురు మీనాక్షిని వెంబడించారు. తిరుపతమ్మను పట్టుకుని కొయ్యతో, ఇనుపరాడ్డుతో తల పగులగొట్టి చంపేశారు చీకట్లో పరుగుుల తీస్తున్న మీనాక్షిని పట్టుకుని చున్నీతో మెడను బిగించి చంపేశారు 

రోడ్డు ప్రమాదంలో వారు మరణించారని నమ్మించడానికి విస్నన్న నాగార్జునసాగర్ కాలువ వద్దకు శవాలను తీసుకుని వచ్చి  వాటిని ఆటోలో ఉంచి కాలువలోకి నెట్టే ప్రయత్నం చేశారు అయితే, కాలువ రివిటె్ మెంట్ గోడలో ఆటో చక్రం ఇరుక్కుపోయింది. ఆటోలో ఉన్న మూడు శవాలు, ఇతర వస్తువులు కాలువ కట్టపై ఉన్న పొదల్లో పడిపోయాయి. 

వెంకన్న భార్య, కుమారుడు తెచ్చిన రెండో ఆటోతో ఢీకొట్టి మరో మారు ఆటోను కాలువలోకి తోసే ప్రయత్నం చేశారు. అది కూడా విఫలమైంది. దాంతో వెంకన్న చేసిన హత్యాకాండ వెలుగు చూసింది.