కాల్చేసే రోజులొస్తాయి: సిఎం రమేష్ పై ఆది సంచలన వ్యాఖ్యలు

కాల్చేసే రోజులొస్తాయి: సిఎం రమేష్ పై ఆది సంచలన వ్యాఖ్యలు

కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తే అదే అనిపిస్తోంది. సిఎం రమేష్ పై ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేసే రోజులు వస్తాయని ఆయన అన్నారు. పోట్లదుర్తి కుటుంబసభ్యులను చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని కూడా అన్నారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు.

తాను గన్‌లాంటి వాడినని, కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని అది అన్నారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడులో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

కొంత మంది తమపై నీచంగా మాట్లాడుతున్నారని, తాను మార్కెట్‌ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమని అన్నారు. రామసుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు దానికి సిద్ధపడినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు రమేష్‌ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారని, ఇక్కడ ఉన్న నాయకులు కాకుండా వారు వందల కోట్ల పనులు చేసుకుంటున్నా తాము పట్టించుకోవడంలేదని అన్నారు. గతంలో కొండాపురంలో ముంపువాసుల కాలనీల్లో చేపట్టిన పనులకు అడ్డుపడితే ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. 

తాను జమ్మలమడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు చంద్రబాబు కచ్చితంగా టికెట్‌ ఇస్తారని అన్నారు.  భవిష్యత్తులో ఏమి జరిగినా తాను కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. కాగా, మినీ మహానాడుకు మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి హాజరు కాలేదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page