రాజమండ్రి: తెలుగు సినీ నటి హేమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. తాను త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీన్ని బట్టి హేమ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎం. కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆమె పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత హేమ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిగా రాజకీయాల్లో పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రాజమండ్రిలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను రాజమండ్రిలో ఇల్లు కట్టుకున్నట్లు కూడా తెలిపారు. 

హైదరాబాదు సినీ పరిశ్రమను వీడి ఒక అడుగు ముందుకేసి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్లు హేమ తెలిపారు. కాపుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో రెండు వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని ఆమె అన్నారు. 

కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. 2019 ఎన్నికలకు ముందు హేమ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .