ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆయనకు వైద్య నిపుణులు ఉదయ్ కనల్కర్, రఘు బృందం చికిత్స అందిస్తున్నారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆయనకు వైద్య నిపుణులు ఉదయ్ కనల్కర్, రఘు బృందం చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్నకు బీపీ అధికంగా ఉండడంతో బ్లీడింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బ్లీడింగ్‌ను నియంత్రించడానికి వైద్య బృందం శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా ఆయన ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 48 గంటలపై ఎక్మో చికిత్స అందించడంతోపాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్టుగా సమాచారం.
ఇక,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గత రాత్రి తారకరత్నను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. కుప్పంలోని పీఈసీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. తారకరత్న వెంట ఆయన భార్య అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా బెంగళూరులోని ఆస్పత్రికి చేరుకున్నారు. బాలకృష్ణ కూడా బెంగళూరుకు చేరుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడూ వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక, ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. లోకేష్ వెంట బాలకృష్ణ, తారకరత్నలు కూడా ఉన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు, మసీదు, చర్చిలను లోకేష్ సందర్శించారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగానే ఒక్కసారిగా తారకరత్నకు కళ్లు తిరిగి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అక్కడి వారు తారకరత్నను వాహనాల్లో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నటుడికి సీపీఆర్, యాంజియోగ్రామ్ చేశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఉండిపోయారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తారకరత్న ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఇక, చంద్రబాబు ఆస్పత్రి వైద్యులు, బాలకృష్ణ, టీడీపీ నాయకులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
మరోవైపు మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి చెందిన కొందరు వైద్యులు కూడా కుప్పం చేరుకున్నారు. ఇక, శుక్రవారం రాత్రి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పీఈఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకనున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తరలించారు. బాలకృష్ణ కూడా బెంగళూరు వెళ్లారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
