రాజకీయ నేతలపై సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియాటుడే’ నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ, ‘నేటి రాజకీయ నేతల్లో 95 శాతం మంది రాస్కెల్స్ ఉన్నారు. ‘ఒక్కొక్కరికీ 25 వేల ఎకరాలున్నాయి’. ‘రూ. 25 వేల కోట్లు సంపాదించుకున్నారు’. ‘ఆ డబ్బంతా ఎవరిది? వారికి ఎక్కడినుండి వచ్చింది ఆ డబ్బంతా’? అంటూ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవలే తాను ఓ నేతతో కలిసి కార్లో వెళుతుంటే హైదరాబాద్ నుండి శంషాబాద్ వరకూ ఉన్న వేల ఎకరాలు తనవే అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. మరోనేత హైదరాబాద్ నుండి వరంగల్ వరకూ, విజయవాడ వరకూ కూడా తనకు భూములున్నట్ల చెప్పారని తెలిపారు. అయితే, తన సోదరుడు, స్నేహితుడు ఎన్టీఆర్ కు మాత్రం అవినీతి అంటే ఏమిటో కూడా తెలీదన్నారు. ఆయనే తనను రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. ఏ మచ్చా లేకుండానే తాను కూడా రాజ్యసభ పదవిని పూర్తి చేసినట్ల చెప్పారు.

ఎన్నికోట్ల రూపాయలు సంపాదించినా ఈ లోకం నుండి వెళ్ళేటపుడు ఖాళీ చేతులతోనే వెళతామన్న విషయాన్ని రాజకీయ నేతలందరూ గుర్తుంచుకోవాలని మోహన్ బాబు చురకలంటించారు. ఎన్నికలకు ముందు ప్రధానిని కలిసి తిరుపతిలోని తమ విద్యాసంస్ధలకు రావాలని కోరితే వస్తానని మాటిచ్చినట్లు మోహన్ బాబు చెప్పారు. అయితే, ప్రధాని అయిన తర్వాత తమకిచ్చిన మాటను మోడి మరచిపోయారని ఎద్దేవా చేశారు.