అమరావతి: సినీనటి కూచిపూడి నాట్యకళాకారిణి మంజుభార్గవి రాజకీయాల్లోకి రానుందా.? ఏపీ సీఎం చంద్రబాబును కలవడంలో ఆంతర్యం ఏంటి. ? గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్న ఆమె త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.  

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సినీనటి మంజు భార్గవి కలవడంతో ఆమె త్వరలోనే టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరగుతోంది. చంద్రబాబు నాయుడుతో దాదాపు అరగంట సేపు సమావేశమైన ఆమె తాను తొందర్లోనే పార్టీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 

గతంలోనే ఆమెను చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. సినీనటి మంజుభార్గవి అంటే చాలు ఠక్కున గుర్తుకు వచ్చేది శంకరాభరణం మూవీ. తెలుగు సినీచరిత్రలో ఒక ఆణిముత్యంలా చెప్పుకునే శంకరాభరణంలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. 

అంతకుముందు అనేక సినిమాల్లో నటించినా శంకరాభరణం మాత్రం ఆమె జీవితాన్నే మార్చేసింది. అంతేకాదు ఆమె శాస్త్రీయ నృత్యకళాకారిణి కూడా. శాస్త్రీయ నృత్యకళాకారిణిగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఆమె టీడీపీలో చేరుతుందా అన్న వార్తలకు మాత్రం ఆమె నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.  

 మరోవైపు సినీనటుడు జగపతిబాబు సైతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. తాను ఓవ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి మాత్రమే చంద్రబాబును కలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తనను రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించినట్లు తెలిపారు. ఇలా వరుసగా సినీనటులు చంద్రబాబును కలవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లోకి జగపతిబాబు..టీడీపీలోకి ఆహ్వానం..?