మంచిపనులు చేసి ప్రజలను మెప్పిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారని చంద్రబాబు చెప్పారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తానంటే ప్రజలు మెచ్చరని కూడా సలహా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే వారిలో ఒక్కరికి కూడా డిపాజిట్లు రాదని చంద్రబాబునాయుడు అన్నారు. శాపనార్ధాలో లేక జోస్యమో తెలీదు గానీ అసెంబ్లీలోనే చంద్రాబాబు వైసీపీ సభ్యులను ఉద్దేశించి పై విధంగా అన్నారు. ప్రత్యేకసాయానికి చట్టబద్దత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలని చంద్రబాబు అన్నారు. అందుకు వైసీపీ అంగీకరించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదాను ఇస్తానని ఎన్నికల్లో చెప్పి మాట తప్పిన కారణంగా తాము మద్దతు తెలపమని జగన్ స్పష్టంగా ప్రకటించారు.
ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో జగన్ వివరించారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో గతంలో రెండుసార్లు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింన విషయాన్ని కూడా జగన్ గుర్తు చేసారు. హోదా వచ్చే పరిస్ధితి లేదని చెబుతున్నపుడు మరి సభలో రెండుసార్లు ఎందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారని జగన్ నిలదీసారు. తప్పుడు చర్యలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో నీతి అయోగ్ నివేదికను చదివి వినిపించారు. దాంతో సభలోమళ్ళీ గోలమొదలైంది. వైసీపీ సభ్యులు ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు స్పందిస్తూ ‘యూ వాంట్ రౌడీయిజం’ అన్నారు. దాంతో వైసీపీ సభ్యులు మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో చంద్రబాబు ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీలో ఒక్కరికి కూడా డిపాజిట్ కూడా రాద’న్నారు. మంచిపనులు చేసి ప్రజలను మెప్పిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారని చంద్రబాబు చెప్పారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తానంటే ప్రజలు మెచ్చరని కూడా సలహా ఇచ్చారు. మొత్తానికి అధికార-ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్యనే కేంద్రానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.
