విజయవాడ: సంగం డైరీలో అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు.

video  ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

ధూళిపాళ్ల అరెస్ట్ పై స్పందించిన చంద్రబాబు... సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టు జరిగిందన్నారు. ధూళిపాళ్ల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే దూళిపాళ్లపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు.

పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 

ఇప్పటికే తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

 ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని ఆయన అన్నారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.