అమరావతి: ఓవైపు బాధితులు కరోనా సోకి బాధపడుతుంటే మరోవైపు చికిత్స కోసం లక్షలు ఖర్చుచేయాల్సి వస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్సకు ఇష్టపడని వారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నవారిపై కూడా ఆర్థిక బారం పడకుండా ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. 

''కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు. పది రెట్లు పెరిగిన ఐసియూ బెడ్లు, వెంటిలేటర్లు. కొత్తగా 108 అంబులెన్సులు, పబ్లిక్ హెల్త్ కేర్ రంగం సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనాను కూడా చేర్చారు సిఎం జగన్ గారు. విద్య, ఆరోగ్యం ఆయన ప్రాథమ్యాలలో ముందున్నాయి'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

read more  శ్రీవారిని సేవించే అర్చకుడికీ కరోనా... మొత్తం 10 టిటిడి సిబ్బందికి పాజిటివ్

ఇదిలావుంటే తెలంగాణలో మాత్రం కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పక్కనున్న తోటి తెలుగురాష్ట్రం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలియజేస్తూ ఇక్కడెందుకు చేర్చడంలేదని ప్రశ్నిస్తున్నారు. 

కరోనా చికిత్సకు బాధితుల నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షల్లో వసూలు చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానాలు తప్ప వేరే  దిక్కు లేకుండా పోతోందని...అందువల్ల కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే వారుకూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ తెలంగాణ బిజెపి కోఠీలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడి కూడా చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.