విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లోకి వేట కత్తితో ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడం ఒక్కసారిగా కలకలం రేపింది. కత్తితో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లోని ఇన్ గేట్ లోనికి ప్రవేశించి విఐపీ లాంజ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. 

దీంతో అతనిని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసి అదుపులోకితీసుకుని పోలీసులకు అప్పగించారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్, పోలీసులు అతడి నుంచి వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరవాడకు చెందిన లోవరాజుగా పోలీసులు గుర్తించారు. 

లోవరాజు ఎయిర్ పోర్ట్ లోకి వేట కత్తితో ఎందుకు వచ్చారో అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇకపోతే అంతకు ముందే ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరారు. 

అయితే ఆ సమయంలో లోవరాజు వేటకత్తితో రావడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కోడికత్తితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న దాడి జరగడం ఇప్పటికీ సంచలనంగా మారింది. అయితే తాజాగా మరోవ్యక్తి వేటకత్తితో లోపలిప్రవేశించడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు అప్రమత్తమయ్యారు.