భర్త నుంచి దూరంగా ఉండే మహిళ.. వివాహితుడైన స్నేహితుడితో కలిసి ఉండాలని.. యూట్యూబ్ లో చూస్తూ..
భర్త నుంచి దూరంగా ఉండే ఓ వివాహిత తన స్నేహితుడు ఎప్పుడూ తనతో ఉండాలని కోరుకుంది. అయితే అతడికి అప్పటికే వివాహం అయ్యింది. దీంతో ఓ హత్య చేసి, స్నేహితుడి భార్యపై మోపాలని భావించింది. తరువాత ఏం జరిగిందంటే ?

ఏపీలోని నెల్లూరులో గతేడాది నవంబర్ లో జరిగిన దారుణ హత్య వెనుక ఉన్న మిస్టరీని తాజాగా పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. వివాహితుడైన స్నేహితుడు ఎప్పుడూ తనతోనే కలిసి ఉండాలని భావించిన ఓ వివాహిత మరి కొందరి సాయంతో హత్యకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యలు మీడియాకు వెల్లడించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరులోని డైకస్ రోడ్డులో ఉన్న ఓ మందుల దుకాణం ఉంది. దానిని పొదలకూరురోడ్డుకు చెందిన జహీర్ బాషా నిర్వహిస్తున్నాడు. కొంత కాలం నుంచి అందులో కావ్య అనే వివాహిత పని చేస్తోంది. అయితే ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో జహీర్, కావ్య చాలా సన్నిహితంగా మెలిగేవారు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు.
జహీర్ కు అంతకు ముందే అస్మా అనే యువతితో పెళ్లి జరిగింది. ఇదిలా కొనసాగుతుండగా.. స్నేహితుడు ఎప్పుడూ తనతోనే ఉండిపోవాలని కావ్య అనుకుంది. కానీ అతడికి అప్పటికే వివాహం జరిగి ఉండటంతో అది సాధ్యం కాదని భావించింది. తన మనసులో ఉన్న కోరికను స్నేహితురాలైన కృష్ణవేణికి చెప్పింది. ఆమె వెంగళరావ్ నగర్ లో నివసించేది.
వీరద్దరూ కలిసి వశీకరణకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఏలూరు జిల్లాలోని కలిదిండికి చెందిన 33 ఏళ్ల మణికంఠ గురించి తెలుకుసుకుని, అతడిని పరిచయం చేసుకున్నారు. అతడిని నెల్లూరుకు రావాలని సూచించారు. రాగానే కావ్య, కృష్ణవేణి ఇద్దరూ కలిసి అతడిని కలిశారు.
స్నేహితుడైన జహీర్ ఎప్పుడూ తనతోనే ఉండిపోయేలా ఏమైనా చేయాలని కావ్య కోరడంతో.. మణికంఠ ఏదో మందు తయారు చేసి ఆమెకు అందజేశాడు. కానీ పని చేయలేదు. దీంతో వశీకరణ చేయడానికి వచ్చిన మణికంఠనే వారు హతమార్చారు. ఈ హత్యను జహీర్ భార్యపై మోపితే.. ఆమె జైలుకు వెళ్తుందని, అప్పుడు స్నేహితుడు తనతో ఉంటాడని భావించింది. ఈ ప్లాన్ కు అనుగుణంగా కావ్య తన కూతురు కృష్ణవేణితో ఓ సూసైడ్ నోట్ రాయించింది. దానిని అస్మాపై అనుమానం వచ్చేలా తయారు చేయించింది. దానిని మణికంఠ జేబులో పెట్టి, డెడ్ బాడీని ఓ గోనె సంచిలో కుక్కి గౌగమ్ నగర్ లో పారేసింది.
దీనిపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మణికంఠ ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని హతమార్చారని పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. ఈ హత్యకు కారణం కావ్య అని తేలింది. దీంతో ఆమెను, ఈ హత్యకు సహకరించిన సాయిప్రియ, కృష్ణవేణి లను కూడా పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.