Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం.. భారీగా కొత్త కేసులు !

Coronavirus: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త‌గా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోజువారీ కేసులు 10 వేలు దాట‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే తిరుప‌తి ఐఐటీలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. అధిక సంఖ్య‌లో విద్యార్థులు, అక్క‌డి సిబ్బందికి క‌రోనా బారిన‌ప‌డ్డారు. 
 

70 students and staff test corona positive cases in Tirupati IIT campus
Author
Hyderabad, First Published Jan 23, 2022, 12:21 AM IST

Coronavirus: అన్ని దేశాల‌ను క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. నిత్యం అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది క‌రోనా మ‌హ‌మ్మారి. ఇదివ‌ర‌కు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్ర‌స్తుతం దాని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు లక్ష‌ల్లో న‌మోదుకావ‌డం కోవిడ్‌-19 ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుత‌న్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (Coronavirus) విజృంభిస్తోంది. ప్రతిరోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా 12,000 మందికి పైగా కరోనా సోకింది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల, ప్రకాశం జిల్లాలోని ఒక పాఠశాలలో మొత్తం 147 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది.  తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో క‌రోనా (Coronavirus) క‌ల‌క‌లం రేపింది. భారీ స్థాయిలో కొత్త కేసులు వెగులుచూశాయి. తిరుప‌తి ఐఐటీ క్యాంప‌స్ లో ఏకంగా 70 మందికి కరోనా సోకింది. ఏర్పేడు జోన్‌లోని ఐఐటీ శాశ్వత క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామనీ, ఈ క్ర‌మంలోనే భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయ‌ని అధికారులు తెలిపారు. తిరుప‌తి ఐఐటీలో క‌రోనా (Coronavirus) బారిన‌ప‌డ్డ 70 మందిలో 40 మంది విద్యార్థులు, 30 మంది బోధ‌న సిబ్బంది ఉన్నారు. వీరంతా  కూడా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

కాగా, ఈ నెల మొదటి వారంలో తిరుప‌తి ఐఐటీ క్యాంపస్‌లోని 600 మంది విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం సొంత ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం క్యాంపస్‌లో ఇంజనీరింగ్, ఎం.టెక్ , పిహెచ్‌డి చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఉన్నారు. క్యాంపస్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా 1566 కొత్త Covid-19 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండ‌గ సంబురాల నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తుంగ‌లో తొక్క‌టంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి పెర‌గ‌డానికి కార‌ణ‌మైంద‌ని నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌డచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా (Covid-19) సోకినట్టు నిర్ధారణ అయింది. గ‌త‌వారంలో ఐదారు వేలు న‌మోదైన కరోనా కేసులు సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా గ‌ణ‌నీయంగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదైన 12,926 క‌రోనా (Covid-19) కేసుల్లో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాలో 1,959 కేసులు న‌మోదయ్యాయి. ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. అలాగే, క‌రోనాతో పోరాడుతూ కొత్త‌గా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో రాష్ట్రలో మొత్తం క‌రోనా (Coronavirus) మ‌ర‌ణాల సంఖ్య 14538కి చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios