తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తిరుపతి గ్యాంగ్‌వార్‌ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు.

రెండేళ్ల క్రితం భార్గవ్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని, అతని హత్యకు బెల్ట్ మురళీ కారణమని ప్రత్యర్థులు భావించారు. దీనిలో భాగంగా అతని వర్గీయులు దినేశ్‌ను రెండు రోజుల క్రితం దినేశ్‌ను హతమార్చారని ఎస్పీ తెలిపారు.

ఈ హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయని ఆయన వెల్లడించారు. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద రౌడీ షీటర్ దినేశ్ (35) హత్యకు గురయ్యాడని రమేశ్ రెడ్డి చెప్పారు.

ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్న దినేశ్ రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఐఎస్ మహల్ సమీపంలో ప్రత్యర్ధులు మాటేశారు. అనంతరం అతనిని చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దినేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.