నిలువెత్తు బంగారం, నిండుగా వెండి, కోట్లాది నగదుతో... దగదగా మెరిపోతున్న మహాలక్ష్మి అమ్మవారు (వీడియో)
కోట్ల విలువైన బంగారం, వెండితో పాటు కరెన్సీ నోట్లతో అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించారు.

కురపాం : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని వివిధ అలంకరణలతో ముస్తాబు చేసి భక్తిశ్రద్దలతో పూజిస్తుంటారు. ఇలా పార్వతీపురం మన్యం జిల్లా కురపాం మార్కెట్ ప్రాంతంలోని పురాతన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఏకంగా ఆరుకిలోల బంగారం, మరో ఆరుకిలోల వెండి... రెండు కోట్ల విలువైన కరెన్సీతో మహాలక్ష్మి సుందరంగా అలంకరించారు. ఇలా 146 ఏళ్లనాటి పురాతన ఆలయంతో బంగారు, వెండి, కరెన్సీ లతో మెరిసిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
అమ్మవారిని రకరకాల ఆభరణాలతో అలంకరించారు. చివరకు చీరను కూడా బంగారంతోనే అలంకరించారు. అలాగే గర్భగుడి నిండా బంగారు ఆభరణాలు, స్వర్ణ పుష్ఫాలతో నిండిపోయింది. అలాగే బంగారు, వెండి బిస్కెట్లను కూడా అమ్మవారి ముందుచారు వ్యాపారులు. ఇక రెండు కోట్ల విలువగల కరెన్సీ నోట్లతో అమ్మవారి గర్భగుడిని సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా కోట్ల విలువచేసే కరెన్సీ, బంగారం, వెండితో చాలా కాస్ట్లీగా అమ్మవారిని పూజించారు.
వీడియో
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అరిశెట్టి దినకర్ మాట్లాడుతూ... గత 20 సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి అలంకరణ సమయంలో భక్తులు బంగారం, వెండి, నగదు సమర్పిస్తారని... వాటితో అమ్మవారిని అలంకరిస్తామని తెలిపారు. ఓ రోజంతా వీటిని అమ్మవారి సన్నిధిలోనే వుంచి తర్వాతి రోజు ఎవరివి వారికి తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. ఇలా తమ సొమ్ముతో అమ్మవారిని అలంకరిస్తే వ్యాపారాభివృద్ది జరుగుతుందని, సమల శుభాలు కలుగుతాయని స్థానిక ప్రజల నమ్మకమని ఆలయ సంఘం అధ్యక్షులు తెలిపారు.