అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నానాటికీ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఏ మాత్రం కట్టడి కావడం లేదు. తాజాగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 425 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. 

ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7496కు చేరుకుంది. మొత్త మరణాల సంఖ్య 92కు చేరుకుంది. రాష్ట్రానికి చెందినవారిలో గత 24 గంటల్లో 299 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో 126 మందికి కరోనా వైరస్ సోకింది. 

మొత్తం 13,923 శాంపిల్స్ నుంచి పరీక్షించగా 299 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.  రాష్ట్రానికి చెందినవారిలో మొత్తం 5854 పాజిటివ్ రాగా, ఇందులో 2983 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 2779 మంది చికిత్స పొందుతున్నారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 289 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ముగ్గురు ఈ రోజు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 242 యాక్టివ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1353 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ రోజు 51 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 611 యాక్టివ్ కేసులున్నాయి.