గుంటూరు: గుంటూరు జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బాలుడి మృతదేహాన్ని వాగులో గుర్తించారు. అనుమానితుడు వీరస్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గోరజవోలులో నాలుగు రోజుల క్రితం నాలుగేళ్ల జశ్వంత్ అదృశ్యమయ్యాడు. జశ్వంత్ కన్పించకుండాపోయిన విషయమై తల్లి ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం గోరజవోలులోని వాగులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.వివాహేతర సంబంధం కారణంగానే ఈ బాలుడిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

ఫిరంగిపురం మండలం సుదురపాడుకు చెందిన లక్ష్మి పాలకోడుకి చెందిన నాగేశ్వరబాబును ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరికి జశ్వంత్ అనే కొడుకు ఉన్నాడు. నాగేశ్వరబాబు అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించాడు. ఆయన మరణం తర్వాత లక్ష్మి వీరస్వామితో సహాజీవనం చేస్తోంది. అయితే నాలుగు రోజుల నుండి జశ్వంత్ కన్పించకుండాపోయాడు.

గోనెసంచిలో వీరస్వామి ఏదో వస్తువును వాగు వైపుకు తీసుకెళ్లినట్టుగా పోలీసులకు గ్రామస్తులు చెప్పారు. వాగు వద్ద పోలీసులు గాలింపు చర్యలు చేపడితే జశ్వంత్ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది.

నాలుగు రోజులుగా వీరస్వామి కూడ కన్పించకుండాపోయాడు. వీరస్వామే బాలుడిని హత్య  చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరస్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.