Asianet News TeluguAsianet News Telugu

ఒడిషా రైలు ప్రమాదం .. 141 మంది ఏపీ వాసుల ఫోన్లు స్విచ్ఛాఫ్ , ఏం జరిగింది..?

ఒడిషా రైలు ప్రమాదానికి సంబంధించి 141 మంది ఏపీ వాసుల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 316 మంది ప్రయాణీకులు క్షేమంగా వున్నట్లు వెల్లడించారు. 
 

316 passengers from andhra pradesh are safe in odisha train accident ksp
Author
First Published Jun 3, 2023, 9:02 PM IST

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవాసులను విషాదంలోకి నెట్టింది. దాదాపు 300 మంది ప్రయాణీకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా.. 1000 మంది క్షతగాత్రులయ్యారు. వీరందరికి ఒడిషాలోని పలు నగరాల్లో వున్న ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు. బాధితుల్లో అత్యధిక శాతం మంది ఒడిషా , బెంగాల్‌లకు చెందిన వారు కాగా.. తమిళనాడు, ఏపీ, కర్ణాటక వాసులు కూడా వున్నారు. దీంతో ఆయా రాష్ర ప్రభుత్వాలు తమ పౌరుల కోసం రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల బృందం ఒడిషాకు వెళ్లింది. ఒడిషా ప్రభుత్వం, రైల్వే శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వీరు ముందుకు సాగుతున్నారు. 

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన మొత్తం 267 మంది క్షేమంగా వున్నారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 165 మంది, రాజమహేంద్రవరానికి చెందిన 22 మంది, విజయవాడ వాసులు 80 మంది వున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో కొందరు ఒడిషా నుంచి నడిపిన ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు. అలాగే రిజర్వేషన్ చేయించుకున్నా ఈ రైల్లో ప్రయాణించని వారు 57 మంది వరకు వున్నట్లు గుర్తించారు. అయితే వీరందరి క్షేమ సమాచారం కోసం ఏపీ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. వీరిలో 113 మంది ఫోన్‌కు స్పందించడం లేదని తెలుస్తోంది.

ALso Read: రైలు ప్రమాదస్థలి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లుతున్న బస్సుకు యాక్సిడెంట్

ఇక యశ్వంత్‌పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన 49 మంది క్షేమంగా వున్నారు. వీరిలో విశాఖకు చెందిన 17 మంది, రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు, విజయవాడ వాసులు 21 మంది, బాపట్ల నుంచి 8 మంది వున్నారు. రిజర్వేషన్ వున్నా 10 మంది వరకు ఈ రైల్లో ప్రయాణించలేదని తెలుస్తోంది. అయితే ఈ రైలుకు సంబంధించి 28 మంది ప్రయాణీకుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు తెలిపారు. రెండింట్లోనూ కలిపి మొత్తం 141 మంది ప్రయాణీకులు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయడం కలకలం రేపింది. వీరు ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు.. ప్రమాదానికి గురయ్యారా అన్నకోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. 

అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో ఏపీ వాసులెవ్వరూ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం లేదన్నారు రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులకు గాయాలైనట్లుగా తెలుస్తోందన్నారు. బాధితుల కోసం మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు ఒడిషాకు వెళ్లారని ఆయన చెప్పారు. బాధితులకు కటక్, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని బొత్స తెలిపారు. 

రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒడిషా ప్రభుత్వం, రైల్వే శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని బొత్స కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని సత్యనారాయణ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios