తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు పురోగతి సాధించారు. పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.15 కోట్లు రికవరి చేశారు.  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ సంకల్ప సిద్ధి స్కాంలో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆర్గనైజర్లు ఐదుగురితో పాటు కోర్ కమిటీలోని పలువురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ స్కాంలో ఇప్పటికే 15 కోట్లు రికవరి చేశారు. సంకల్ప సిద్ధి లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఇదిలావుండగా.. సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషోర్ ఏర్పాటు చేశారు. ట్రేడింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పేరుతో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి అనుమతి తీసుకున్నారు. నిరుడు అక్టోబర్ లో ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్ ను రూపొందించారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు తెరతీశారు. సంకల్ప సిద్ధి సంస్థ బాధితుల నుంచి రూ.240 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తం 17 ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. 60 వేల మంది ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టగా.. అదనపు కమీషన్ కోసం 20 వేల మందికి పైగా డబుల్ ఐడీలు క్రియేట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా బాధితులు వున్నట్లు తెలిపారు. 

ALso REad: సంకల్పసిద్ది విషయంలో తప్పుడు ఆరోపణలు: టీడీపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన వల్లభనేని వంశీ

సంకల్పసిద్ది వ్యవహరంలో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సంకల్ప సిద్ది విషయంలో తనకు సంబంధం లేకున్నా తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వంశీ చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించారు. 

అలాగే సంకల్పసిద్ది స్కాంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ ఈ నెల 1వ తేదీన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కూడా ఆయన కోరారు.సంకల్పసిద్దితో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ స్పష్టం చేశారు.ఈ కేసులో రాజకీయ నేతలకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ ప్రకటించిన విషయాన్ని వల్లభనేని వంశీ గుర్తు చేస్తున్నారు.