సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. 119 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లకు  కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడం కలకలం సృష్టిస్తోంది.  

సంగారెడ్డి: యావత్ దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ (telangana) లోనూ విజృంభిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయినప్పటికి విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే అనేకమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడగా తాజాగా హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad)లో భారీగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

హైదరాబాద్ (hyderabad) శివారు జిల్లా సంగారెడ్డి (sangaredddy district)లోని ఐఐటీ క్యాంపస్ లో ఏకంగా 119మంది విద్యార్థులు, ప్రొఫెసర్లకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కొందరు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా భారీగా కేసులు బయటపడ్డాయి. కరోనా నిర్దారణ అయిన విద్యార్థులు, ప్రొఫెసర్లు సురక్షితంగానే వున్నారని... అందరూ హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్నట్లు ఐఐటీ అధికారులు వెల్లడించారు.

ఇలా హైదరాబాద్ ఐఐటీతో కరోనా బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. క్యాంపస్ విద్యార్థులతో పాటు సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు చేయనున్నట్లు ఐఐటీ అధికారులు తెలిపారు.

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ (warangal medical college) కాలేజీలోనూ కరోనా కేసులు వెలుగుచూసాయి. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరాయి. సోమవారం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఇక మంగళవారం పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 

 వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్ అప్రమత్తం అయ్యారు. పాజిటివ్ గా నిర్థారణ అయిన మేడికోలను ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. 

కాగా గత శుక్రవారం జనవరి 7న వరంగల్ నీట్ (warangal NIT) క్యాంపస్ లోకి కరోనా కలకలం సృష్టించింది. క్యాంపస్ లో చదివే విద్యార్థులు, ప్రొఫెసర్లలో ఇప్పటివరకు 16మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్ఐటీ విద్యార్థులు కొందరు ఇళ్లకు వెళ్లివచ్చారు. అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్యాంపస్ అధికారులు అనుమానంతో టెస్టులు చేయించగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో క్యాంపస్ లోని మిగతా స్టూడెంట్స్ కు కూడా కరోనా టెస్టులు చేయగా మొత్తం 16మందికి పాజిటివ్ గా తేలింది. 

ఇలా క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 16వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా నిర్దారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని... అందరు విద్యార్థులు ఆరోగ్యంగానే వున్నారని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలావుంటే గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో ఇప్పటికే జీనోమ్​ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్​కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.