కర్నూల్: కరోనాతో  ఎక్కువ సంఖ్యలో వృద్ధులు మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే కరోనా నుండి రికవరీ అవుతున్న వారిలో వృద్ధుల సంఖ్య కూడ ఎక్కువగానే ఉంటుంది. దేశంలోని పలు చోట్ల 105, 110 ఏళ్లకు చెందిన వృద్ధులు కరోనా నుండి కోలుకొన్నారు. తాజాగా ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ కు చెందిన ఓ 105 ఏళ్ల మహిళ కూడ కరోనా నుండి కోలుకొన్నారు.

కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానావీధికి చెందిన బి.మోహనమ్మ వయస్సు 105 ఏళ్లు. ఆమె భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు. మోహనమ్మకు ఎనిమిది మంది సంతానం.  వీరిలో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కుమారుల్లో ఒకరు ఇటీవలే మరణించారు. 

 మోహనమ్మ తన పనులు తానే చేసుకుంటున్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్‌ చేస్తారు. మితాహారం తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు. 

60 ఏళ్లు దాటిన వారికి వలంటీర్లు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ పట్టణంలోని మోహనమ్మకు కూడ కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా సోకినట్టుగా గత నెల 19వ తేదీన తేలింది. ఆమెను కుటుంబసభ్యులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

also read:కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ: 3 నెలలు కోవిడ్ పై పోరాటం

కరోనా సమయంలో ఆమెకు స్వల్పంగా జ్వరం వచ్చింది. అయితే అదే సమయంలో ఆమెకు ఆయాసం రావడంతో ఆక్సిజన్ అందించారు. ఇతరత్రా సమస్యలు రాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత గత నెల 31వ తేదీన ఆమె  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 

బీపీ, షుగర్ ఉన్నా కూడ ఆమె కరోనా నుండి బయట పడింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే తాను కరోనా నుండి బయటపడినట్టుగా ఆమె చెబుతున్నారు.