Jul 7, 2020, 5:49 PM IST
తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ చేపడుతున్న ప్రతినిర్మాణం ప్రజల అవసరాల ప్రాతిపదికనే జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు.. కొత్త కలెక్టరేట్ ల నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నివాసంతోపాటు కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోందని వెల్లడించారు. గతంలో అస్తవ్యస్థంగా చేపట్టిన నిర్మాణాలతో సచివాలయం.. ఇటు పరిపాలన, అటు ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రజలకు .. ఒకేచోట సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశ ప్రధాని సైతం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా సమాధానం చెప్పిందో… కొత్త సచివాలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు సరైన జవాబు లభిస్తుందని వినోద్ కుమార్ వెల్లడించారు.