నా దత్తత ఫారెస్ట్ లో విద్యార్థుల సందడి సంతోషదాయకం..: బిఆర్ఎస్ ఎంపీ సంతోష్

Feb 14, 2023, 2:21 PM IST

మేడ్చల్ : చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, అడవుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తెలంగాణ అటవీశాఖ వనదర్శిని పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులను అడవులకు తీసుకెళ్లి వివిధ రకాల వృక్షాలు, జంతువుల గురించి వివరిస్తున్నారు అటవీ అధికారులు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నాగారం జడ్పిహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులను కీసర అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళారు. వివిధ రకాల మొక్కల గురించి వివరించి... అడవుల ఉపయోగాలు, చెట్ల నరికేత వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు.  అయితే తాను దత్తత తీసుకుని సంరక్షిస్తున్న కీసర అటవీ ప్రాంతంలో వనదర్శిని కార్యక్రమం జరగడంపై బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ స్పందించారు. వనదర్శిని కార్యక్రమంలో భాగంగా  కీసర ఎకో ఫారెస్ట్ ను విద్యార్థులు సందర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తాను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్న ఫారెస్ట్ ఫలితాలను ఇస్తోందని ఎంపీ సంతోష్ పేర్కొన్నారు.