Feb 6, 2023, 2:40 PM IST
విశాఖపట్నం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ''యువగళం'' పాదయాత్రకు వైసిపి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ గండి బాబ్జీ ఆరోపించారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కరెంట్ కట్ చేసి, డిజే వాహనాలు సీజ్ చేసి ఇబ్బందులు సృష్టించారని అన్నారు. దీంతో లోకేష్ ఓ ఇంటిపైకి ఎక్కి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇలా రాజ్యాంగం కల్పించిన భావాలను వ్యక్తం చేసుకునే హక్కును కాలరాస్తూ జగన్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రజలు తమవెంట వున్నారు కాబట్టే మేం భయపడటం లేదు... కానీ లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎం జగన్ ప్యాంట్లు తడుస్తోందని బాబ్జీ మండిపడ్డారు. 175 సీట్లు గెలుస్తామని ధీమా వున్నపుడు పాదయాత్ర చేస్తోంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు... ముఖ్యమంత్రికి అసలు బుద్దుందా? అని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ 4వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేస్తారని గండి బాబ్జీ పేర్కొన్నారు.