నెల్లూరులో విషాదం... కన్నీళ్లను దిగమింగుతూ కొడుకు శవాన్ని బైక్ పై తరలించిన తండ్రి

May 5, 2022, 11:02 AM IST

నెల్లూరు: కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న ఆ తండ్రి కన్నీళ్ళను దిగమింగుతూ కొడుకు మృతదేహాన్ని భుజానేసుకుని బైక్ పై ఇంటికి చేర్చాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో బుధవారం చోటుచేసుకుంది. 

బుధవారం శ్రీరామ్(8), ఈశ్వర్(10) అనే ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో పడి మృతిచెందారు. అయితే శ్రీరామ్ ను నీటిలోంచి బయటకు తీయగానే తల్లిదండ్రులు దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రైవేట్ వాహనాలు మృతదేహాన్ని తరలించడానికి నిరాకరించడంతో 108 అంబులెన్స్ సిబ్బందిని ఇంటికి తీసుకెళ్లాలని బాధిత కుటుంబం వేడుకొంది. కానీ 108 సిబ్బంది మానవత్వాన్ని మరిచి నిబంధనల పేరిట మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో చేసేదేమిలేక ఆ తండ్రి బిడ్డ మృతదేహాన్ని  బైక్ పైనే ఇంటికి తరలించాడు. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.