విజయవాడ కొత్త సీపీగా బత్తిన శ్రీనివాసులు

Jun 15, 2020, 12:11 PM IST

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు.  ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్‌లైన్‌ మోసాలపై  సైబర్‌ సెల్‌ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు.