
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో ఆడ గాదు ఈడ గాదు అమీరోళ్ల మేడ కాదు అంటూ టైటిల్ సాంగ్ లో కొన్ని లైన్లు పాడిన మొగులయ్య అందరి ప్రశంసలు అందుకున్నాడు. భీమ్లా నాయక్ చిత్రంతో కిన్నెర కళాకారుడిగా మొగులయ్యకి దక్కిన గౌరవం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా మొగులయ్య సెలెబ్రిటీ అయిపోయారు.
అంతే కాదు మొగులయ్యని తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకి నామినేట్ చేసింది. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొగులయ్యకి కోటి రూపాయల తో పాటు ల్యాండ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా తన కొడుకు మెడికల్ ఖర్చుల కోసం, ఇతర అవసరాల కోసం మొగులయ్యకి ప్రభుత్వం ప్రతి నెల 10 వేలు సాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆ సాయం కూడా ఆగిపోయింది. కోటి రూపాయలు, ల్యాండ్ సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఆయనకి ఆర్థిక సాయం కూడా అందడం లేదు. ఇటీవలే ప్రభుత్వం నుంచి సాయం ఆపేశారట. కారణాలు తెలియవు.
దీనితో మొగిలయ్య కుటుంబాన్ని పోషించుకునేందుకు డైలీ లేబర్ గా మారారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన కొడుకు మెడికల్ ఖర్చులకే పతి నెల 7 వేలు అవసరం అవుతాయట. ప్రభుత్వం నుంచి వస్తున్న 10 వేలు ఎందుకు ఆపేశారో తనకి తెలియదు అని మొగులయ్య అంటున్నారు.
అరుదైన కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పరిస్థితి చూసి అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.