తెలంగాణ వారికి ఎంపీ పదవులు... మరి మా సంగతేంటి జగనన్నా..: ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన

May 18, 2022, 5:22 PM IST

విశాఖ: ఆంధ్ర ప్రదేశ్ నుంచి భర్తీకానున్న రాజ్యసభ సీట్లను తెలంగాణ వారికి కేటాయించడంపై ఏపి నిరుద్యోగ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీకి చెందిన విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీట్లు బాగానే వున్నా తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డికి ఎపీ నుండి ఎంపీ చేయాలన్నదానిపైనే తాము అభ్యంతరం తెలుపుతున్నట్లు నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్ తెలిపారు. 

జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ఎండగడుతూ విశాఖలోని శాంతిపురంలో నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. ఏపి ప్రయోజనాలు ఏమాత్రం పట్టని తెలంగాణ వారిని రాజ్యసభకు పంపడమేంటని ప్రశ్నించారు. ఏపిలో అభ్యర్ధులే లేనట్లు తెలంగాణ వారికి పదవులు కట్టబెట్టడం ద్రోహం కాదా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి వారేమైనా పోరాడగలరా  అని మండిపడ్డారు. కాబట్టి రాజ్యసభ కేటాయింపులు వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ నిరుద్యోగ జేఏసి డిమాండ్ చేసారు.